Friday, 3 August 2012

నాచు పట్టిన గోడ

ఈ నాచు పట్టిన గోడ పక్కగా తడిచిన పూలను కోసి గుత్తుగా నీ చేతిలో వుంచి కళ్ళలో వెలుగు చూసిన గురుతు... ఆ తడి ఇంకా ఆరనే లేదు ఈ గోడపై ఎండిన నాచు పెళ్ళలు పెళ్ళలుగా రాలి ఏవో అస్పష్ట ఆకారాలు నలుపు తెలుపుల రంగు మాధ్యమంలో... ఆ వెలుగు జిలుగు ఈ కంటి రెప్పలు దాటి బయట మెరియనే లేదు సంధ్య కాంతిని పులుముకుంటూ కొండ వాలులోకి జారిపోతూ.... ఆ చేతి మృధుత్వం అలా నరనరాన ప్రవహిస్తూ వానలో కరిగిపోనూ లేదు గోధూళిని దోసిలిలో నింపుతూ మస్తిష్కంలో రంగుటద్దంపై అలికినట్టూ... ఆ అడుగుల సవ్వడి అలా అలల వెల్లువలా ఒడ్డుకు చేరనూ లేదు రాళ్ళ గవ్వల ఒరిపిడిని రాగంజేస్తూ మనసులో అసంపూర్ణ గేయమైనట్టూ... ఆ గాయపు గురుతులేవో కలల దేహంపై ఎర్రగా చారలుదేరుతూ స్వేదమింకిన నేల బీటలు వారుతూ కణకణ మండే ఉచ్వాశ నిశ్వాశలైనట్టూ.... చివరిగా ఆ గోడపై ఓ చిగురు తొడిగిన మొక్క పచ్చగా పైకెగబాకుతూ వేకువ వెలుగు రేఖల వెచ్చదనమౌతూ గుండె అలికిడికి గురుతుగా పూస్తున్నట్టూ...