Saturday, 25 August 2012

ఎందుకో కానీ ప్రేమిస్తారు స్త్రీలు

ఎందుకో కానీ ప్రేమిస్తారు స్త్రీలు ప్రేమ అనుకుని, ప్రేమను అందుకుందామని ఎందుకో కానీ ప్రేమిస్తారు స్త్రీలు పిల్లలు తిరిగే లోకాలలో, శిశువులు నవ్వే కాలాలలో పూవులు తిరిగే, తిరిగి పూసే రంగుల క్షణాలలో ఎందుకో కానీ ప్రేమిస్తారు స్త్రీలు అద్దంలోంచి మన ముఖాల్ని లాగాడానికీ ముఖాల్లోంచి అద్దాలని తీసివేయడానికీ, మన హృదయాలని భక్షించి తమ హృదయాలని శిక్షించుకుని, చిందరవందర అయ్యేందుకు ఉక్కిరిబిక్కిరి అయ్యేందుకూ ఎందుకో కానీ ప్రేమిస్తారు స్త్రీలు అరచేతుల్లో వీడ్కోలు అయ్యి, కళ్ళల్లో ఎదురు చూపులయ్యీ దినానంతాన గుమ్మానికి అనుకుని నిన్ను స్మరించుకుంటూ నిన్ను శపించుకుంటూ ఎందుకో కానీ ఎందుకో ప్రేమిస్తారు స్త్రీలు వానలు కురిసే వేళ్ళల్లో, ఎండ చిట్లే కాలాల్లో వొంటరిగా ఒక్కళ్ళే అనేకం అవుతూ, అనేకం అయ్యి వొక్కళ్ళుగా మిగులుతూ దీపం వెలిగించిన చీకట్లో తమని తాము రాసుకుంటూ నిన్ను నీకు చెరిపివేస్తూ ఎందుకో కానీ, ప్రేమిస్తారు స్త్రీలు ఎందుకో కానీ మోహిస్తారు స్త్రీలు ఎందుకో కానీ నీకు మృత్యువుని పరిచయం చేసి మృత్యుంజయులుగా మిగిలిపోతారు స్త్రీలు, ఏమీ మిగుల్చుకోని స్త్రీలు ఏమీ లేని ఏమీ కాని స్త్రీలు ఎందుకో కానీ నిన్ను ప్రేమించే స్త్రీలు

No comments: