Thursday, 23 August 2012
నన్ను నేను వెతుకుతున్నా
నన్ను నేను వెతుకుతున్నా
ఎన్నో నువ్వులు దొరికాయి
నవ్వులు కొన్నీ
కన్నీళ్ళు కొన్ని..
కలతలకు కొన్నీ
కలలూ కొన్నీ
కరచాలనం తో కత్తిపోట్లు
ప్రేమగా బహుమతిచ్చిన గుండెగాట్లు
ముళ్ళనిపించీ ముద్ద మందారమైనట్టు
గులాబీ సొగసు ఆశకద్దినట్టు
ఇదో వలయం కలల నిలయం
ప్రశ్నకో రోజులేదు
ప్రేమకో క్షణమూ ప్రత్యేకం కాదు
ప్రేమగా ప్రశ్నని స్పృశిస్తే
సమాధానం మరో ప్రశ్నవైపు చూపి
తీయగా నవ్వుతుంది
కాలానికీ కొంటెతనమూ ఎక్కువే
నావాళ్ళనుకునేలోగా నిలువుటద్దంలా హృదయం భళ్ళుమంటుంది
చిరునవ్వులు అపరిచితమై దిగులు మేఘాలే అంతా
ఇంతలోనే చినుకులా రాలి దేవతల్లే హత్తుకుంటాయి
ఎన్నడూ చూడని చిరునవ్వులు కొత్త రూపాలుగా మారి...
ఇదో వలయం కలల నిలయం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment