Wednesday, 8 August 2012

దిద్దుబాటు

దిద్దుబాటు లేకుండా రాసిన కవితంటూ ఉందా? సర్దుబాటులేని జీవితముంటుందా?? ఓడినంతమాత్రాన నీ జాడ మరుగైనట్టుకాదు, సానుభూతికోసం ప్రయత్నిస్తూ చతికిలపడకు. ఓడిపోవడం చెడ్డపని కాదు, అలాగని,ఆగిపోవడం దొడ్డపనికాదు. ఓటమి కారణాలు చెప్పేందుకు ప్రయత్నించకు, గెలుపు తోరణాలు సిద్ధించేందుకు యత్నించు. ఓడినవాడి కారణాలు వినేదెవ్వడు, గెలిచినవాడ్ని కారణాలు అడిగేదెవ్వడు. అలసిపోతే ఆశించిన ఫలితం దక్కదు, లక్ష్యం... మగ్గిన మావిడిపండు కాదు, గాలికి రాలి నీ చేతిలో పడేందుకు. నిట్టూర్పుని నిషేధించు, బద్దకాన్ని బహిష్కరించు, నిర్విరామ సాధన చెయ్, గెలుపు నీ తలుపు తట్టకమానదు. గురి ఉంటే విడిచిన శస్త్రం, లక్ష్యం చేదించక మానదు. దృఢచిత్తం ఉంటే గమ్యం,ముంగిట్లో వాలక ఆగదు.

No comments: