Saturday, 25 August 2012

పర్లేదు

దయగానే ఉండు, పర్లేదు విసిరిన రాళ్ళని పూలుగానే అందుకో నెత్తురు హారాలుగానే అలంకరించుకో దయగానే ఉండు, పర్లేదు రాత్రైతే నిన్ను నువ్వు దాచుకోడానికి నీలో నువ్వు ఒక నీటి నిశి పందిరిని అల్లుకో: అది కన్నీళ్ళసమాధి అయినా సరే, గాయాల లోగిళ్ళు అయినా సరే - పర్లేదు దయగానే ఉండు లోకంతో జనంతో: గుర్తుంచుకో- దీపం చుట్టూతానే నువ్వు చూడలేనంత చీకటి ఆగి దాగి ఉంటుంది. ఆరిపోయి కూడా మిగిలిపోయి నలుమూలలా సాగే ఆ దీపపు ధూపం నీవే! సమయం ఆసన్నమయ్యింది, యిక మూయి నీ నీలి పద నీలాల కనులను-

No comments: