Tuesday, 7 August 2012

ఆశ -నిరాశ -భవాని ఫణి

ఆశావాది : వర్షమెంత బాగుందో కదూ!! నిరాశావాది :మేఘాల చేతుల్ని కప్పుకుని ఆకాశం అదుపుతప్పి రోదిస్తోంది ... ఆశావాది : కాదు.. కాదు.. తన ఆనందాన్ని చినుకులుగా చేసి అల్లరిగా కురిపిస్తోంది ఆశావాది: ఆ హరివిల్లు ఎంత అద్భుతంగా ఉంది!! నిరాశావాది: దుఃఖాతిశయాన్ని ఓపలేక గగనం తన రంగుల పెదవిని విషాదంతో విరుస్తున్నట్లుంది ... ఆశావాది : కాదులే...తన వర్షాతిశయాన్నిఆపలేక ఏడు వర్ణాల సాక్షిగా కాంతి కిరణాలతో సంతోషాన్ని పంచుకుంటోంది!! ఆశావాది: ఆ అందమైన సూర్యాస్తమయాన్ని చూడు !! నిరాశావాది: విధి నిర్వహణ నుండి తప్పుకోవాలని ఎందుకో భానుడికి అంత తొందర ... ఆశావాది: అదేమీ కాదు ..భూమ్యాకాశాల సరిహద్దులు దాటి ఆవలి లోకంలో ప్రాణశక్తి నింపాలని పరుగులు తీస్తున్నాడు ఆశావాది: ఈ పున్నమి రాత్రి కనువిందు చేస్తోంది !! నిరాశావాది: దివినంతా కబళించిన నిశీధి మనలోను చేరాలని రోజుచేసే కుతంత్రమేగా... ఆశావాది: అలా అనకు..అందమైన ఈ రేయి తారల కళ్ళతో తళుకుమని మెరుస్తూ చందమామ పెదవులతో వెన్నెల నవ్వులు చిందడం లేదూ!! ఆశావాది: కమ్మని నిద్ర ఎంత హాయిగా వస్తోంది!! నిరాశావాది: మృత్యు నీడలా వచ్చి కనురెప్పల్ని కలవరపరిచి కఠినం గా కబళిస్తోంది... ఆశావాది: తప్పు.. తప్పు .. స్వప్నలోక విహారానికి తీసుకు పోయే దేవకన్యలా సుతిమెత్తగా జోకొడుతోంది ఆశావాది: ఈ సూర్యోదయం కడు రమణీయం !! నిరాశావాది: అగ్ని బాణాలు వేసి మాడ్చి మసి చేసేందుకు మళ్ళీ సిద్ధమా ఈ మాయదారి సూర్యుడు .. ఆశావాది: అజ్ఞాన తిమిరాలని తరిమికొట్టి జ్ఞానదీపాన్ని వెలిగించాలని వేగంగా వస్తున్నాడు సూర్య భగవానుడు మనసు గవాక్షాలు తెరిచి చూడు నేస్తం !!!

No comments: