Saturday, 25 August 2012

అడవులు

కలక అంటిన కళ్ళలోకి ఓ తల్లి పాలచుక్కలు వేసినట్టు లేత ఉదయపు సూర్యరశ్మి, చినుకులై కళ్ళలోకి జారే మృదువైన అడవి దారి- చాచిన అరచేతిలోకి నిండుగా నీడలూ అరిచే పక్షులూ గాలీ చీకట్లో ఎక్కడో చిలుకలు వాలి రెక్కలు విశ్రమించిన ఒక నిర్మలమైన లోకమూ, కాలమూ- పురా స్మృతులతో మనిషి ఆదిమ ఆనందంతో మనిషి భూమిపై పుట్టుమచ్చైన నగువైన పాపమైన శాపమైన శోకమైన పవిత్రమైన మనిషి ఇక్కడి నించీ యింకా రాలేక, ఖండిత పట్టణ బాహువులలో ఒదగాలేక అదే మనిషి యిక యిక్కడే ఈ పూటకి తనని తాను పచ్చిక మైదానాలో పారవేసుకుని, ఉన్నాడు తొలిసారిగా. అది సరే కానీ ఫిరోజ్ ఇంతటి చల్లటి ప్రియమైన నిశ్శబ్ధాన్ని మన హృదయాలలోకీ దేహాలలోకీ యింత ఆకస్మికంగా తీసుకు వచ్చింది ఎవరు?

No comments: