Monday, 30 July 2012

నా జిల్లా

తెలుగుతల్లి నుదుట సింధూరమై వెలుగు తెలంగాణపాపిట సింగారమై చెలగు కోటి రతనాల వీణపై గజ్జెకట్టిన జాణ తెలుగు నేలకు కరీంనగర్ కళల నజరానా గోదారి ఒడిలోన జలకమ్ములాడి త్రిలింగ క్షేత్రాన భస్మరేఖలు దిద్ది మంత్రకూటాన వేద పఠనమ్ము చేసి వేములవాడన కోటి లింగార్చన చేయు కన్నె నాజిల్లా నల్ల పరంధాములు చేతి నాజూకు చీరకట్టి సిల్వర్ ఫిలిగ్రీ నగిషీల రవిక తొడిగి దేదీప్యమానమౌ విద్యుల్లతల ఒడ్డాణము ధరించి సింగరేణి గనుల దిష్టి తీయించుకొని శాతవాహనుల కీర్తి అందెల మ్రోయుతుమ్మెదగా పరుగెత్తు మానేటిధార నాజిల్లా చిలక జోస్యాల ముద్దు మాటల మురిపించి గంగిరెద్దు సన్నాయి పాటల ఓలలాడించి మిద్దెరాములునోట ఒగ్గుకథల నొలికించి సాధనాశూరుల పల్లకిలొ పయనించి బహురూపుల చిందు వేయించు ముగ్ధ నాజిల్లా పాలనా దక్షయై ప్రధాని పీఠమధిరోహించి విశ్వంభరమై జ్ఞానపీఠమలంకరించి పంపమహాభారతమై కన్నడనాదరించి యశస్తిలకమ్ము దిద్దుకొన్న ప్రౌఢ నాజిల్లా భీమకవి నోట చాటువై స్రవియించి జినవల్లభుని కందపద్యమై చరియించి సినారె మాకందాల లకుమ నృత్యమై రవళించి ధర్మన్న చేతి చిత్ర భారతమ్మై నారన్న గంటాన మహాభాగవతమ్మై శేషప్ప సీసాన నరసింహ రూపమై సిద్దప్ప బోధలో జ్ఞానామృతమ్మై తెలుగువాణికి పురుడుపోసె తెలంగాణ భాషయై తొలి తెలుగు వల్లభుని భూపాలినియై కోటిలింగాలలో శాంతికి పరచిన ధవళ యవనికయై ధూళికట్టలో భారతభారతీ గళాభరణమై సిరిసిల్లలో తెలంగాణకు పట్టపురాణియౌ నాజిల్లా!

No comments: