ఎక్కడి నుండో గాలి రెక్కలపై వాలి
చిరు తొలకరి పులకరింతల్లో
మట్టి పండించిన అలవోక పరిమళాలు
నడి వేసవి వడగాడ్పులో ఇవ్వాళ్టి బాట సుగమం చేసుకుంటున్న
మెరుపు చెమటల అలసటకు వీవెనలై
నా కనురెప్పల భవిష్యద్దర్శనం అద్దాల్లో
రేపటి ఆగామి సౌఖ్యానికి అల్లిన కలల
పరదాల అంచులచిరు మువ్వల సవ్వడులై
సుదూరంగా ....
భావశకలాలు మేఘ మాలికలై
ఒకదాన్నొకటి ఒరుసుకుంటూ చేసే ఘర్జనల
మెరుపుల సడికి తాళంలా
అతిపెద్ద అలలా మారి కమ్మేసిన నిస్తబ్ద సముద్రం
గొంతుకలుపుతూ తీరం పొడుగంతా ఇసుక సమాధుల్లో
పీతల పసిపాపలు
ఎవరి నిష్క్రమణ ఎవరికీ అశనిపాతంకాదు
ఎక్కడా కాలం ఒక ఋతువును అజరామరం చెయ్యదు
కలనేత సమయం సరిగమల్లో ఒక్క మోహనమో భూపాలమో
కాదు
సరిగమల సమ్మిశ్రితం అటు ప్రమోద జలపాతలూ
ఇటు నిశ్శబ్ద గమకాల గుసగుసలూ
శిశిరం రెండు చేతులా విరజిమ్మిన పొగమంచు మసకలో
ఒక దాని వెనక మరొకటిగా అనవరతం సాగే గమ్యం లేని
అవిశ్రాంత గమనం
నిన్న రేపవుతుందన్న ఆశలో............
No comments:
Post a Comment