Saturday, 21 July 2012
నీకు నచ్చినంత నిశ్శబ్దాన్ని తిను ప్రేమా!!
ముడిపడిన రెండు మనసుల మధ్యన
మౌనం ఎంత ఎదిగితే అంత మంచిది...
ఎందుకంటే..
మౌనభంగం అయ్యాక..
పుట్టుకొచ్చే ప్రేమ ఊసులతో
రేయి- పగళ్ళు ఎలా గడిచిపోతాయో
ఇరు మనసులూ ఎరుగవు...
పర్లేదు ప్రేమా..
నీకు తోచినంత నిశ్శబ్దాన్ని తిను...
కనీసం ఈ సమయంలోనైనా
నీ గుండెల్లో పలికే
నా పేరు "లబ్డబ్" లను
తనివితీరా వినగలను కదా...!!
కన్నీళ్ళున్నాయని గుర్తుకుతెచ్చే..
మనసెరుగని కలతని పెంచే...
మన మధ్యన ఈ మౌనం
ఎన్నాళ్ళో... నేనూ చూస్తా..!
ఈ భారమైన సమయంలో
నీకు చెప్పుకోలేని ఊసులన్నిటినీ
నా పెదవంచునే బంధించేస్తా...
మనకోసం కన్న కలలన్నిటినీ..
నా కనురెప్పల కిందే కట్టడి చేస్తా...
నను తలవకుండా నీకు
పూటైనా గడవదని నాకు తెలుసు..
నీ ఊహ లేకుండా క్షణమైనా
నేను ఊపిరి కూడా తీసుకోలేనని
నీకూ తెలుసు...
ఈ విషయం ఇద్దరికీ తెలుసు కదా..!
కాకపోతే ఒక్కటే బాధ..
నా అడుగుల్లో...
నీ అడుగు జాడల్లేవు...
నా గుండెలపై నీ పెదవుల
చిలిపి దాడుల్లేవు...
ప్చ్...!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment