Tuesday, 24 July 2012
పయనం ...
ఆ సాయంత్రం
గుబులు నీడలు గుండెను కమ్మిన
ఆ సాయంత్రం
ఆశలన్నీ ఉడిగి
నిస్త్రాణమైన ప్రాణంతో
పడని అడుగులను
ఈడ్చుకుంటూ ...
ఆ వేసవి సాయంత్రం
నీటి చుక్క కరువై
కన్నీరు కూడా చిందలేని
ఆర్చుకుపోయిన కళ్ళతో
చెలిమి చెలమలింకిపోయిన
ఆ సాయంత్రం
అసహాయంగా ఆకాశం వైపు
చూస్తూన్న రైతులా
వర్షాధారిత పంటల కోసం
వాన కోసం
ఎదురు చూస్తూ
జీవితపు కోర్కేలన్నిటికీ
తాళం పెట్టి ....
జీవికకోసం వెదికి వెదికి వేసారి
ఉసూరంటూ ఎడ్వలేని
బ్రతుకిక ఈడ్వలేనని
రుజువైపోయిన ఆ సాయంత్రం
గమ్యం లేని నడకతో
బతుకు మీది కసితో
అడవుల వైపు అడుగులేసిన
ఆ సాయంత్రం
ఆ చీకట్లలో
దారీ తెన్నూ లేక
నడక సాగిస్తూనే
అర్ధం లేని అర్ధం కాని
గుండె ధైర్యమేదో
అవహించినట్టు
అవగతం కాని
మొండి తనమేదో
కాలం పై కసి తీర్చుకోమన్నట్టు
ఆ సాయంత్రం
అలా మొదలైంది నా నడక
గమ్యం అందక పోయినా
కనీసం నడిచిన దారిని
ఆస్వాదించే వైపుగా ...నా పాదాలు
ఆ సాయంత్రం
ఇన్నేళ్ళకి ఒక స్వతంత్ర నిర్ణయం
తీసుకున్న ఆ సాయంత్రం ....
నిర్భీతిగా , నిశ్చలంగా ..
సంధ్య కెంజాయలో...కలిసి
నీరవ నిశీధిలోనికి....
ఒక వెలుగు రేఖ కోసం పయనించిన
ఆ సాయంత్రం ...!!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment