Tuesday, 24 July 2012
...............???
ఏం వెతుక్కుంటున్నానో
నాకే తెలియదు ...
ఏదో తీయని స్పర్శ కావాలని
అంతరంగం మారాం చేస్తోంది
ఓదార్చే ఓ కరుణామయ స్పర్శ కోసమా?
ఈ ఆరాటం....
ఏమో .....అలా అయితే
నను ప్రేమించే వారి స్పర్శ నాకు
తృప్తి నివ్వాలి గా.....
ఉహు....నా మనసుకి ఆశ ఎక్కువ
కన్న ప్రేమ మధురిమను
పంచే కన్న బిడ్డ స్పర్శా?
అవును కావాలి
నా కలలు కన్నీళ్లు పంచుకునే
స్నేహ స్పర్శ కోసమా?
ఆ అదీ కావాలి
మరింకా ఏమి కావాలి
నన్ను ఎదకు హత్తుకుని
నాలో ఒదిగి పోయే ప్రియుని
స్పర్శ కోసమా?
మరే అదీ కావాలి
అందరూ అంటారేమో
ఆత్మీయమైన ఓ చల్లని స్పర్శ చాలని
కానీ మరదేమో .....నాకు
చాలా స్పర్శలు కావాలనిపిస్తుంది
అయినా ఏదో అసంతృప్తి .....
ఇంకా ఏదో మిగిలి ఉన్నట్టు
ఇంకా రావాల్సింది రానట్టు
కావాల్సింది దొరకనట్టు
అనిపిస్తుంది ....
నిజమే నాకిప్పుడే తెలిసింది
నే కోరుకునేదేమిటో
ఎవరినో .....ఎవరి స్పర్శ నాకు
తృప్తి నిస్తుందో....
అది నన్ను చల్లగా తాకి
నాలోని నన్ను తనలోకి
తీసుకుని .....
నేననే అస్తిత్వాన్ని లేకుండా
చేయగల ఒకే ఒక్క
మధురామృత స్పర్శ
ఎవరెలా నన్ను భావించినా
అనాదిగా నే కోరుకున్న
తపస్సు చేసిన స్పర్శ అదే
నేను కోరుకునేది నాకిప్పుడు
స్పష్టమైంది.....
నా ఆత్మ సాక్షిగా
నే అర్ధించింది ..........
అలసి సొలసి
ఒదిగి సేద తీరాలనుకునే
ఒకే ఒక ఆత్మీయ ఆరాధనీయ స్పర్శ
అవునది ఎవరిదో నాకు మాత్రమే తెలుసు
ఆ స్పర్శ పొందాక
ఇక నేననేదాన్నే ఉండని ........
ఆ నిశ్శబ్దపు చల్లని మంచు లాంటి
కౌగిలి స్పర్శలో లయించి
పంచ భూతాలలో ఏకమై పోయే
ఆ అద్వైతపు స్పర్శ .....
ఆ ప్రాకృతిక స్పర్శ కోసమే ...
నా ఈ నిరంతర నిరీక్షణ.....
ఫలించే ఆ దివ్య క్షణం.....ఎపుడో ???
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment