ఆకాశమంత ప్రేమని హృదయంలోకింకింపచేసి
భావుకత్వపు నాగలితో నా మనస్సుని చదును చేసినా
ప్రేమపదవిత్తనం మొలకెత్తేందుకు ఆలోచిస్తోందెందుకని!
కనురెప్పపరదా వెనుక ప్రతిఫలిస్తున్నా
పదగవాక్షపు పరదా తొలగించి బయటికొచ్చేందుకు
అంతులేని ప్రణయప్రసవవేదన పడుతోందెందుకని!
నా ప్రేమని పదాల్లో పలకాలని విఫలయత్నం చేసి
నాల్గువేదాల సాగరమంత పదజాలాన్ని ఆవిష్కరించలేక
నా హృదయాకాశన్నంతా నీ సుకుమారహస్తాల్లో ఇమిడే కుసుమాలుగా మార్చి
మమతానురాగాల దారాలతో చుట్టి, భావ నక్షత్రం గుచ్చి నీకందిస్తున్నా
నా చేతనున్న ఈ కుసుమాలే నా అలౌకిక ప్రేమకు సాక్ష్యాలని నీకు తెలియజెప్పేందుకు
మరుభూమినెంచుకున్నా..ఇంతకన్నా వేరేమీ చేయలేకున్నా
నీ చితిలోనైనా తోడొస్తానని మాత్రం మాటిస్తున్నా
నువ్వు తేల్చిచెప్పక మరుజన్మకై వరమిస్తానన్నా..
ఈ మరుభూమి సాక్షిగా ఈ క్షణమే మరణిస్తానంటున్నా !!
1 comment:
nice
Post a Comment