Wednesday, 23 May 2012

ఒక్కోసారి అంతే..

ఒక్కోసారి అంతే..
తను పెరిగి పెద్దవాడైనా 
తన వెనకే నడవాలని 
తన నీడనే వుండాలని
కోరుకుంటుంది మనసు...

కానీ 
నా లాంటి 
అమ్మలనెందరికో
పుత్ర వాత్సల్యాన్ని తీర్చే
కొడుకుగా నడుస్తూ
వెళతావని ఊహించలేదు...

నాకు నీ రాజకీయ ప్రకటన
అర్థం కాలే..
కానీ అర్థాకలితో నిదరోయే
ఎన్నో కాలిన పేగుల వాసన
దానిలో కనబడి
నిన్ను తలచిన ప్రతిసారీ
నా పేగు కదిలింది...

ముంగిట వున్న
మామిడి చిగురువేసి
పూత వచ్చి పిందెలన్నీ
పండ్లుగా మారిన ప్రతిసారీ
గుర్తుకొస్తూనే వుంటావురా...

పొలం గట్లపై
లేడి పిల్లలా దుంకుతూ
తల్లి ఆవు వెనక
పరుగుపెట్టే లేగ దూడ
లేత గిట్టల్ని చూసినప్పుడంతా
యాదికొస్తావురా...

తొలకరి చినుకు పడి
మట్టి పురిటి వాసన
వేసిన ప్రతిసారీ
నీ తొలి పిలుపు
మెదిలి కన్న
పేగు మెలిపెడ్తుందిరా..

నీవు చెప్పే మాటలన్నీ
పాడే పాటలన్నీవినబడీ
చనుబాలధార కడుతుంటే
కన్నీళ్ళింకినది గుండెల్లోకాదని
తెరిపినిస్తుంది...

ఒక్కొక్కరు ఒక్కో మాటాడుతూ
తూట్లు పొడవాలని చూస్తుంటే
నీ గుండెనిబ్బరం చూసి
అమ్మనైనందుకు
గర్వంగా వుంటుంది...

నీవలాగే
నిరంతరమూ ఎక్కుపెట్టిన
విల్లులా నిలిచి
పోరుసల్పాలని
ఆశపడుతూ
పొడుస్తున్న
పొద్దులో వెతుకుతు...

No comments: