Saturday, 13 October 2012

ఆక్రందన

అమ్మా... ఎక్కడున్నావు, ఇక్కడంతా చీకటి, ఏవో కదలికలు, బహుశా నాలాంటి నెత్తుటి గుడ్లు అనుకుంటా. నీ గర్భంలో వెచ్చగా ఉండేది, ఇంకేన్నాళ్ళులే ఈ అంధకారం, త్వరలోనే దొరుకుతుంది అమ్మ మమకారం అనుకున్నా, లింగ పరీక్షలో నను దొంగలా పట్టుకుని, నిను నిందించి, నాన్నని ఒప్పించారు. నా అంతానికి నాన్న సంతకాన్ని పునాది చేసారు. శాస్త్రమా... నీది వైజ్ఞానమా అజ్ఞానమా! నా జాడ తెలుసుకొనుట నీకు సత్ఫలితమా, విధాత నిర్ణయం నీకు పరిహాసమా, బ్రహ్మకు ప్రతిసృష్టి అయిన ఆడ శిశువులకిది సమాప్తమా. దేవుడా ... ముకుళిత హస్తాలతో మోకరిల్లుతూ రక్తసిక్తమై విలపిస్తూ విన్నవించుకుంటున్నా, నా రోదన, అమ్మ వేదన కనని కర్కశపు చేతులు నను తల్లి నుండి వేరు చేసాయి. ప్రభూ... అమ్మ వడి కరువైన నన్ను నీ దరిచేర్చుకో. నేను లేక ఆగిపోనున్న ఈ జగతిని జాగృతి చెయ్యి. నా ఆగమనం అజరామరం చెయ్యి.

No comments: