Wednesday, 31 October 2012

గ్లోబల్ వల

నువ్వు! కుండకు ఏ మిశ్రమం వాడతావ్ నాగలిని ఏ పద్దతిలో చెక్కుతావ్ క్షవరం నీ సొంత కళా , కాటికాపలా నీ వారసత్వమా! అగ్గిపెట్టెలో చీరా, ఆవకాయ తొక్కూ అడవి పాటా, అక్షరం తూటా, నీ తెలివే రచించిందా! నువ్వు కనిపెట్టావనడానికి, నువ్వు కనిపెంచావనడానికి నీదినీదేననడానికి, నువ్వునువ్వేననడానికి రేపు నీ డి.ఎన్.ఏ నీ పూర్వీకునిదేననడానికి నీకో పేటెంట్ కావాలంటుందీ వల. మా వారసత్వానికి మీ గర్భకోశం అద్దెకు దొరుకుతుందా! మీ జాగలో మా విత్తులు మొలకెత్తిస్తారా మా ఫాషన్ షోలో సూపర్ న్యూడ్ ఫోజిస్తారా మీ డేటింగ్ కోసం మా యువరాజు కాచుకున్నాడు వస్తారా విలువల వలువలకు కన్నాలు వేసిందీ వల. అర్ధరాత్రి ఆన్ లైన్ సేవలు, మెదళ్ళు లేని కర్మచారులు వీకెండ్ సంసారికులు, విత్తనాళ్ళేని గింజలు హృదయాల్ని శరీరాల్ని భూమ్యాకాశాలు చేసి బతుక్కోసం బలిపెట్టించే గ్లోబల్ వల రక్తబంధాల్నీ రాత్రి ముచ్చట్లనీ ఆడతనాన్నీ జాలిగుణాన్నీ అగ్గిపుల్లలుగా విస్తరాకులుగా కార్పోరేట్ ధరలపట్టికగా బజారుపాలు చేసిన వ్యాపార వైర్ల వల ఏ అమర్త్యునికీ అర్థం కాని మృత్యు హేల మార్కెట్టంతా అంబానీల గోల సెజ్ ల వల చిన్న చేపల విలవిల. ఇప్పుడు మనిషికీ మనిషికీ మధ్య వ్యాపారం పొర ఆత్మకూ ఆత్మీయతకూ జబ్బు తెర ఆసియాకూ ఐరోపాకూ అనారోగ్య పోటీ చట్టబద్దంగా సకల వృత్తుల లూటీ ప్రపంచమొక వ్యాపార సంద్రం గ్లోబును ఖండఖండాలుగా కొరుక్కుతింటున్న తిమింగలం. అంత సులభంగా తెగేది కాదు ఈ వల ప్రపంచ సప్లయర్ల ద్వారా ప్రతి తలకూ అనుసంధానం చేయబడ్దది మనుషుల వేళ్ళతో పనిలేకనే జెండాల ఎజెండాలతో పీటముడి వేసుకున్నది విశ్వనరుల ఆకలిమెతుకుల మీద సుతారంగా పన్నిన వల ఇది. రాబందుల ఫైవ్ స్టార్ కల ఇది. ఇక మనం పదునెక్కడమా! కదం తొక్కడమా! కలం నిప్పులు కక్కడమా? రెప్పలు తుడవడమా? దారం తెంపడమా! ఉరిపొయ్యడమా! నాకు తెలిసి చరిత్రెప్పుడూ సమూహంతోనే పరుగు తీసింది సమూహమే చరిత్రకు సువర్ణాక్షరాలిచ్చింది వలపన్నిన వేటగాళ్ళకు ఒక్కటైన పావురాళ్ళే గుణపాఠం నేర్పింది.

No comments: