Thursday, 18 October 2012
ఓ స్త్రీ... నువ్వెలా బ్రతుకుతున్నావ్??
ఇద్దరివీ మాంసపు ముద్దలే...!!
కానీ ఒకదానికి "ఆడది" అనే పేరు ఉండటం చేత...
ఎక్కడలేని డిమాండ్.....!!
గోతికాడ నక్కల్లా,
ఆ "ఆడ" మాంసపు ముద్దల్ని కరుచుకు తినేందుకు
తగ్గని తహతహలతో
ఎదురుచూసే మృగాలెన్నో....
అడుగు బయట పెట్టిన దగ్గర్నుండీ,
వేలాదిగా తన మీదకి
విసరవేయబడుతున్న వెకిలి చూపుల
"వేట" కత్తులకి,
తన మానాన్ని చిక్కనీకుండా...
'అవమానం'లో చిక్కుకోకుండా
ఎంత నేర్పుని ప్రదర్శించాలో ఆడది....
అయినా ఓడిపోతూనే ఉంది...
ఎప్పుడు నేర్చుకుంటుందో మరి??
చీర నిండుగా కప్పుకున్నా,
స్త్రీ లోగుట్టుని బయటనుండే వెతుక్కునే
మగాళ్ల కంటి స్కానర్లని
నిరోధించే శక్తి పాపం ఆడదానికెక్కడిది?
పైట కాస్త పక్కకు తప్పుకుంటేనే,
పైశాచిక ఆనందాన్ని పొందే
మృగాళ్ల కక్కుర్తికి హద్దెక్కడిది?
అందాన్ని ఆనందించాలి
అనుభూతి చెందాలి ...
అంతవరకే అయితే అసలు గొడవే లేదు..
అనుభవించాలి...అంతమొందించాలి అనుకుంటేనే
ఆత్మరక్షణ కరువైన ఆడోళ్ళకి అవస్థలు...!!
రెచ్చగొట్టే వయసులో,
తెలిసో...తెలియకో నేనూ చేసా తప్పులు....
సమర్ధించుకోవడానికీ సిగ్గుపడేన్ని...!!
పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు...
ఆ లెక్కన నేను ప్రతి క్షణమూ పాశ్చాత్తాపపడుతున్నాను....
అందుకే, ఆడవాళ్ళ పట్ల ఉన్న దృక్పధం నాకెప్పుడో మారిపోయింది...
బహుశా,
వయసు నేర్పించిన పాఠం కావొచ్చును...!!
అనుభవాలు ఇచ్చిన అమూల్యమైన బహుమానం కావచ్చును
ఇప్పుడు నాకున్న ఈ విచక్షణ...
నేనెప్పటికీ స్త్రీ పక్షపాతినే...!!
కొన్ని విషయాల్లో...కొంత వరకు...
ఉన్నట్టుండి పెల్లుబికిన ఈ ఆవేశానికి
పెద్దగా కారణమేమీ లేదు....
గత కొద్ది రోజులుగా నా కనుల ముందు
ఆడవాళ్ళ పట్ల జరుగుతున్న
అన్యాయాలకి,ఆఘాయిత్యాలకి
మనసు పొరల్లో అంటుకున్న మంట
దావానంలా నా తలపుల్ని దహించివేస్తోంటే...
దగ్ధమవుతున్న నాలోని మనిషి పెట్టిన
ఆక్రందనలకి అక్షర రూపమే ఇది...!!
చివరిగా చెప్పొచ్చేదేమిటంటే,
ఆడవాళ్ళ దగ్గర్నుండి మగాళ్లు పొందే
మానం కంటే, అంతులేని "అభిమానం" విలువ
అన్నింటి కంటే చాలా ఎక్కువ...!!
కనుకే, వారికివ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇద్దాం...
"ఆడదే ఆధారం... మన కథ, ఆడనే ఆరంభం" అని ఏనాడో అన్నాడో పెద్దాయన...!!
ఆఫ్ట్రాల్,
నేను మగాడిని అని గర్వంగా, నమ్మకంగా మనం మీసం మెలివేయాలంటే
మనకి కావలసింది ఆ "ఆడదే"...మనం "ఆడించేదే"...!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment