Saturday, 13 October 2012
నిన్నేమనుకోను
అలజడి అంబుధిలో మునుగుతున్న నాకు ఆధారంలా అనిపించావు,
ఆశగా పట్టుకుంటే... విదిలించి వదిలించుకున్నావు.
చింత సంద్రాన మునిగిన నాకు చిరుహాసంలా చేరువయ్యావు.
పట్టుకొని అధరంపై అద్దుకోనేలోగా..నిట్టూర్పువై నిష్క్రమించావు.
అంధకార పయోధిలో పడిపోయిన నాకు కాంతిరేఖవై కనిపించావు.
పట్టుకుని కళ్ళలో పెట్టుకొన్నానో లేదో .. కంటిపాపనే ఎత్తుకెళ్ళావ్.
కలల కడలిలో మునుగుతున్న నాకు స్వప్న కెరటంలా కనిపించావ్.
కళ్ళుమూసుకొని స్వాగతించానో లేదో..కలతనిద్రవై కష్టపెట్టావ్.
దిక్కులన్నీ ఏకం చేసి వెతికి,వెతికి జనసమూహాన నినుగాంచి,
పరుగున వచ్చి పలకరినచానో లేదో...అపరిచితునిలా వెడలిపోయావ్.
ద్రవించే హృదయం,మతిలేని మనస్సూ నీ చుట్టూ భ్రమిస్తున్నాయని ,
తెలుసుకోన్నావో లేదూ, కక్షగా వాటి కక్ష్య మార్చివెళ్ళావ్.
విసిగి,వేసారి ఈ వెక్కిరించే ఊహలన్నీ నను ఊపెస్తుంటే ఊపిరి సలపని,
ఉరిఊయల ఊగాలనుకున్నానో లేదో..ప్రాణవాయువై పలకరించావ్.
ప్రతి రోజూ నన్ను నేను గుర్తుచేసుకుంటాను శాపము మోసే శకుంతలలా,
చిరునవ్వుతో పలకరిస్తావ్ అసలేమీ నీకు తెలియదన్నట్లుగా...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment