Monday, 15 October 2012

// మా కిటికీ లో ఒక చంద్రుడు//

నిద్దురని టీ కప్పు లో పోసుకొని ఆమె కళ్ళలో మనసుని దింపేసి సేద తీరుస్తూ కూర్చుంటానా..... ఎలా వచ్చే వాడో కిటికీకి తనని తాను కట్టేసుకునే వాడు చంద్రుడు పనేం లేనట్టు... // మా కిటికీ లో ఒక చంద్రుడు// నాకు పోటీగా నాకంటే ముందుగా ఆమే మేనిని తాకినప్పుడు 'మబ్బులడ్డం రానీ నీ సంగత్తేలుస్తా ' అన్న నా బెదిరిం పులకు హేలనగా నవ్వుతూ నాతో సంబందం లేనట్టుగా వెన్నెలని ఆమె మొహానికి అతికించేసి వాడిని వాడే క్లోనింగ్ చేస్కునే వాడు // మా కిటికీ లో ఒక చంద్రుడు// ఆమె కురుల్లో నేను మొహం దాచుకోగానే దొంగ చాటుగా పరుగెత్తుకొచ్చి తన బుగ్గల నిండా సిగ్గుని స్ప్రే చేసెవాడు.. అధరాలని పీల్చుకున్నప్పుడు వీది చివరి "అమృతా వైన్స్" బోర్డు ని ఓదార్చే వాడి మాటలు మత్తెక్కిననా కర్ణభేరిని పలకరిస్తూనే ఉండేవి రాత్రంతా.. // మా కిటికీ లో ఒక చంద్రుడు// మేం ఖజురహొ శిల్పాల అణువణువుల్లో జీవాన్ని నింపుతున్నప్పుడు కుళ్ళుతో మొహం మాడ్చుకొని చీకటిని మా మీద కప్పే వాడు పగలంతా ఏ తారతో కలిసి మమ్మల్ని ఆవాహన చేసుకునేవాడో.. మర్నాడు కిటికీ రెక్కలకు నీరసంగా వెళ్ళాడే వాడు // మా కిటికీ లో ఒక చంద్రుడు// నవ్విస్తూ,కవ్విస్తూ,లవ్విస్తూ.. మెదిలిన ఆమె నా గుండెల్ని ఖాళీ చేయకుండా తలపుల నిండా తామసి మసి చల్లేసి వెళ్ళిపోయాక మా కిటికీ చువ్వలకు చంద్రుడు ఉరేసుకున్నాడు పాపం......... // మా కిటికీ లో ఒక చంద్రుడు//

No comments: