Saturday, 13 October 2012
అన్వేషి.//మధ్యతరగతి మానవుడు//
తేదీ చూస్తే ఇరువైఐదు..
విడుదల ఎరుగని జీవితఖైదు..
మధ్యతరగతి మానవుడు
మనసులో మెదులుతున్న మాట..
చక్కెరలేని కాఫీతో లేపిన ఉదయం
బస్సుటికెట్ చిల్లర వెతకడంతో మొదలవుతుంది.
"సరుకులు నిండుకున్నాయండి"..వినిపించి
వినిపించని మాటలను విననట్లే అడుగు బైటకి వేస్తాడు..
సందు చివర కిరాణా షాపువాడు
కిందటి నెల బాకీ అడుగుతాడేమొనని
జవాబు వెతుకుతూ..తరువాత నెల
కోసం బడ్జెట్ తయారుచేసుకుంటూ అడుగులు వేస్తాడు..
అవసరాలు తప్పవు ఆడంబరాలే తగ్గించుకోవాలి
అని మనసులో అనుకుంటూ..ఆలస్యమౌతున్నా
జేబులో చివరి వందనోటు ఆటొని పిలవమంటున్నా
ఆఫీసు దగ్గరేగా అని ఆత్మవంచన చేసుకుంటూ..
"ఈసారైనా ఫీజు కడతావా నాన్నా" అన్న చిన్నకూతురి
మాటలు "అసలు కట్టగలవా" అని సూటిగా నిలదీస్తుంటే
ఆఫీసు వచ్చేసిందని అలోచనలుకి ముసుగు తొడిగేసి
తన మనసుని తానే మోసం చేసుకుంటూ..
మనకి ఒక రోజు వస్తుందని ఆశగా ఎదురుచూస్తూ..
మారుతున్న డైరీలతో మార్పులేని దినచర్యతో
జీవితంతో రాజీ పడిపోయి కాలం వెళ్ళదీస్తుంటాడు..
మనలో ఒకడు..మధ్యతరగతి మానవుడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment