Saturday, 13 October 2012

నా గుండెలనిండా వెచ్చదనం!

వర్తమానం జడివానై ముంచెత్తుతుంటే నవ్వులెందుకని ప్రశ్నిస్తుంది కాలం, సమస్యలు సుడిగాలై చుట్టుముడుతుంటే ఏమిటి నీ ధైర్యమంటుంది లోకం - నాకు మాత్రమే తెలిసిన నిజమొకటుంది నేస్తం..! నీ జ్ఞాపకాల గొడుగు కాపాడుతున్నంత కాలం నా గుండెలనిండా వెచ్చదనం! నీ ఆలోచనలు తోడైనంత సేపూ నమ్మకమే నా రక్షణ కవచం..!! దిగులుమేఘం కరగడానికి కత్తుల యుద్ధం కావాలా..!? బాణాల పోరాటం చెయ్యాలా..!? నేస్తమయ్యే పవనమొక్కటి చాలదూ.. నమ్మకాల జల్లులు కురిసి, లోకమంతా పువ్వుల కాంతులు వెలగడానికి! దారులన్నీ రంగుల వాగులవ్వడానికి!! నీడల వాడలనీ, వెలుతురు ద్వారాలనీ ఎంచి చూసే విద్య నేర్పిన ఉపాధ్యాయుడు, భావి జీవన సమరానికి సిద్దం చేస్తూ గెలుపు మంత్రం ఉపదేశించిన యోధుడు, ఆప్యాయతలో బాధ్యతని గుర్తుచేస్తూ లక్ష్యం వైపు నడిపించిన సైనికుడు, తప్పటడుగులు తప్పుటడుగులు కాకుండా తోడు నడిచిన మార్గదర్సి, నీకు సరిపడా నీడనివ్వడానికి కొండలనెత్తడానికైనా తెగించిన సాహసి, తన పేరుతో నిన్ను గుర్తించే కంటే, నీ పేరుతో తనని గుర్తిస్తే, గర్వంచిన అల్పసంతోషి, ఆ నాన్నకు జేజేలు! ఆ నాన్నకు జోహార్లు!! నువ్వు-నేను, మనము-మనసు.. భావాలలో ఒదిగే ప్రేమ - వృత్తాకార పయనం లాంటిది, సుదూరప్రయాణం అనిపిస్తుంది, కానీ 'నువ్వు' చుట్టూనే తిరుగుతుంటుంది..! కరుణ, జాలి, దయ.. గుండెల నిండుగా నింపే ప్రేమ - అనంతంగా వ్యాపిస్తుంది ప్రపంచాన్ని కౌగిలిస్తుంది, విశ్వజనీనమై పునీతమౌతుంది..!

No comments: