Monday, 15 October 2012
మనమూ ఉన్నందుకు సంతోషంగా లేదా నేస్తం
ఈ విశాల విశ్వం భలే గొప్ప పెద్ద భవనం!
తూర్పు మహాద్వారం సూరీడి వెలుగు తోరణం!
పడమటి పెరడు నిండా ఘుమఘుమల జాజిమల్లెలు!
ఉత్తరాన ఆటల మైదానంలో పిల్లల సందడి!
దక్షిణాన చల్లగాలిని మోసే విశాలమైన గదులు!
స్విమ్మింగ్ పూల్స్ లాంటి మహా సముద్రాలు,
నందనవనాలను మురిపించే అందమైన అడవులు!
కోటానుకోట్ల జీవరాశులకు ఇక్కడ చోటుంది!
నిత్యం వచ్చిపోయే నిరంతర జీవ ప్రవాహం!
పుట్టుకలను ఆదరంగా, నిష్క్ర్రమణలను నిశ్శబ్దంగా స్వీకారం!
పొద్దుపొడుపులకు, ఆరుఋతువులకు, ఎల్లప్పుడూ స్వాగతం!
వానచినుకును హత్తుకుంటుంది! వెండివెన్నెలను పలకరిస్తుంది!
తుఫానులను తట్టుకుంటుంది!ప్రళయాలకు ఎదురు నిలబడుతుంది!
ఏనాడు మొదలైందో ఈ విశ్వ నిలయం నిర్మాణం!
ఎప్పుడూ కూలిపోని అద్భుత దివ్యసౌధంలా సుస్థిరం!
ఎన్నెన్ని సంస్కృతులను తనలో దాచుకుందో భద్రంగా!
ఎప్పుడూ పైరుపచ్చనవ్వులతో ఆకలి తీర్చే అన్నపూర్ణ!
జీవనదుల ధారలతో గలగలలాడుతూన్న చలివేందరం!
జననమరణ చక్రభ్రమణాలను చూస్తూ, మోస్తూ..
కాలానికి ఎప్పటికప్పుడు చరిత్రనందిస్తూ..
ఆ దేవదేవుడి విశాల నేత్రం లా వెలిగే విశ్వం లో
మనమూ ఉన్నందుకు సంతోషంగా లేదా నేస్తం!?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment