Saturday, 13 October 2012

స్నేహం

ఇరుగింట్లో, పొరుగింట్లో, బడిలో, గుడిలో బువ్వలాటల్లో, కాకెంగిలి పంపకాల్లో శ్రీరామ నవమి పందిట్లో నాలుగుస్తంభాలాట ఆడే వేళల్లో నేలా-బండా ఎక్కి దిగే వేళల్లో ఆగస్టు పదిహేను ఊరేగింపుల్లో తప్పు ఎక్కాలకి ఉత్తుత్తి చెంపదెబ్బల్లో మాష్టారింట్లో కోడిగుడ్డు దీపం వెలుతుర్లో సవర్ణదీర్ఘాది సంధులు, పైథాగరస్ సూత్రాల వల్లెల్లో అమ్మ కోప్పడితే తుడిచే కన్నీరులో సాయంకాలం రామాలయపు అరుగుల మీద తెలియని ఓదార్పునిచ్చిన భగవద్గీత శ్లోకాలలో కోతికొమ్మచ్చి కొమ్మల్లో, తొక్కుడు బిళ్ళాటలో ఒప్పులకుప్పల్లో , చెమ్మచెక్కల్లో శివరాత్రి జాగరణలో, అట్లతద్ది దాగుడుమూతలాటల్లో నెల పట్టిన సంక్రాంతి ముగ్గుల్లో, గొబ్బి తట్టే వేళల్లో వినాయకుడికి పత్రి కోసే వేళల్లో అమ్మ పూజకి నందివర్ధనాల్ని ఎంచే వేళల్లో పరీక్ష ముందు భయంలో పరీక్షలయిపోయిన సంబరంలో వేసవి శలవుల్లో దొంగా-పోలీసు అయిన వైనాల్లో మల్లెపూల జడల మురిపాల్లో, మొగలిరేకుల్లో యవ్వనపు తొలిరోజుల చిరు రహస్యాలలో మలి నాళ్ల భావోద్రేకాల్లో ఎండల్లో, వానల్లో, చలిలో మబ్బులు ముసురు పట్టిన వేళల్లో రాత్రి లో, పగటిలో, కష్టం లో, సుఖం లో ఎప్పుడూ నాతోనే వున్నావు ఎక్కడ వెదికితే అక్కడే దొరికావు అప్పుడప్పుడు చేయి విడిచినా నిన్ను అందుకోవటం ఎలాగో నేర్పావు… ఎవరూ నువ్వని ఎవరైనా నిన్నడిగితే చెప్పు…స్నేహం! నాకు నువ్వే చెలిమీ, కలిమీ, బలమని.

No comments: