Saturday, 13 October 2012

నారీహృదయం

అగ్ని పరీక్షకు నిలబడ్డ సీతమ్మ అపనింద భరించలేక భూమిలోకి క్రుంగింది! అది స్త్రీ ఔన్నత్యం! అవమానం సహించలేని ద్రౌపది అక్షౌహిణుల సైన్యం తో కురుక్షేత్రం నడిపించింది! అది స్త్రీ వ్యక్తిత్వం! మగువ మాంచల ప్రేమాన్వితమూర్తి! పలనాటి నాగమ్మ పగబట్టిన శైవపుత్రి! పురాణాలు, చరిత్రలు ఎక్కడైనా తానొక విశ్వరూపం! ఆరళ్ళు పెట్టే అత్తింట్లో కన్నీళ్ళు తాగుతూ కన్నతల్లి అవుతుంది! అది స్త్రీ సహన శక్తి! అగ్నికీలలా జ్వలిస్తూ ఆరని మోహాలలో మగాళ్ళని ముంచి ఆటాడిస్తుంది! అది స్త్రీ సమ్మోహన శక్తి! కిరోసిన్ మంటల్లో తగలడుతూ కాపురం నిలబడాలని కోరుకుంటుంది! అది స్త్రీ సౌశీల్య శక్తి! యాసిడ్ భుగభుగలు కాల్చినా ప్రేమను ఛీ కొడుతుంది! అది స్త్రీ నిర్ణయ స్థిరత్వం! కన్న వాళ్ళను కాదని, కులాన్ని కాదని కళ్ళుమూసుకుని వెంట నడుస్తుంది! అది స్త్రీ నమ్మకం! కంటి చూపులతో శాసిస్తూ కాఠిన్యతను శ్వాసిస్తుంది! అది స్త్రీ సమర్థ నాయకత్వం! భగవంతుని స్మరిస్తూ ఆధ్యాత్మికతకు తానే చిరునామా అవుతుంది! అది స్త్రీ విశ్వాసం! నమ్మిదంటే అర్పణం! ఆగ్రహించిందంటే జ్వలనం! తోడుగా నడిస్తే నీడ! కసిగా చూస్తే నాగు! చేయి అందిస్తే చెలి! ఒడలో చేరిస్తే అమ్మ! ఆడదంటే తోలుబొమ్మే! కాదని నిరూపించే కాళికే! నాణేనికి రెండే వైపులు కానీ నారీహృదయం ఎన్నో రూపులు! అందుకే నేస్తం! భర్తృహరి ఆరుగుణాల ఆడతనాన్ని అమరం చేశాడు!

No comments: