Tuesday, 16 October 2012
స్నేహం
అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపజేసే ఏకైక పదం స్నేహం. ఆ పద ధ్వనే అలౌకికానందాన్ని ఇస్తుంది. మండుటెండలో చల్లని ఐస్ క్రీం తింటున్న అనుభూతినిస్తుంది స్నేహం అనే భావన. చల్లని చలిలో వెచ్చని జ్ఞాపకాలను అందించే గతమే స్నేహం. నిర్వచనానికి అందని అతి సున్నితమైన ఫీలింగ్ స్నేహం.
మంచి స్నేహాన్ని సంపాదించుకోవడం అంత సులభం కాదు. సంపాదించుకున్న స్నేహం చేస్తే జీవితాన్ని అంతా సుఖమయం చేస్తుంది, లేకుంటే సర్వనాశనం చేస్తుంది. ఒక వ్యక్తి గుణగణాలను అతడు పెంచుకున్న స్నేహాన్నిబట్టే నిర్ణయించగలం. ఒకరితో స్నేహం కలుపుకుని చెలిమిని పెంచుకోవాలని నిర్ణయించుకుంటే వారి స్థితిగతులను, జీవిత సరళిని, మనోవైఖరిని, వారి అలవాట్లను, అభ్యాసాలను పూర్తిగా తెలుసుకోవడం అవసరం. వారి నైజాన్ని అర్ధం చేసుకుని వారి ఆలోచనలు, అనుభూతులు ఎలా ఉన్నవీ గమనించాలి. నిజమైన స్నేహితుల మధ్య రహస్యాలు ఉండవు.
సమయానికి తగినట్లుగా తమ కష్టసుఖాలు ఒకరికొకరు పంచుకుంటారు. స్నేహంలో సుఖాలు పరస్పరం ప్రవృద్ధిని పొందుతాయి. దుఖాలు విభాజ్యాలవుతాయి. కష్ట సమయంలో కలత చెందిన మనసుకి శాంతిని కలిగించే దివ్య ఔషధం స్నేహం. అవసరమైనప్పుడు సహకరించడానికి ఆప్తమిత్రులు ఉన్నారనే భావం మన కష్టాలకు నివృత్తిని కలిగిస్తుంది. సుఖ సంతోషాలకు దోహదంచేస్తుంది.
"మంచి స్నేహితుల చెలిమితో స్నేహాన్ని పెంపొందించుకోవాలంటే నీవు ఉత్తమ మిత్రునిగా రూపొందించుకోవాలి". అసలైన మిత్రులు మన స్వభావాన్నిబట్టి, గుణాన్నిబట్టి ఏర్పడుతున్నారుగానీ మనం ఇచ్చేదాన్నిబట్టి ఏర్పడడం లేదు.
నిజమైన స్నేహానికి భగవంతుడు ఇచ్చిన అపూర్వ కానుక నిష్కపటము, నిష్కలంకము అయిన ప్రేమ. పరస్పర స్నేహంతో సాధించలేని విజయముండదు. స్నేహితుల నైపుణ్యానికి, శక్తిసామర్ధ్యాలకు అసూయపడకూడదు. స్నేహితుల గుణగణాలను పొగడడం ఉత్తమ స్నేహితుని లక్షణం.
ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం తెరిచిన పుస్తకంలా ఉండాలి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment