Monday, 15 October 2012

నేస్తం

ఇంట్లో ఒంటరిగా వున్నాను. ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న క్షణాలివి. ఎన్నెన్నో ఆలోచనలు అసంపూర్తిగా. ఒక ఆలోచనకు, మరొక ఆలోచనకు సంబంధంలేదు. అసలెంత బాగుందో ఇలా...సమయమే తెలియట్లేదు. ఈ క్షణంలో ఎవరన్నా తోడుంటే ఇంకా బాగుండుననిపించింది. వెంటనే నువ్వే గుర్తొచ్చావు. అదేమిటో కోరుకున్న ఒంటరితనం దొరగ్గానే నువ్వు నాపక్కన వుంటే బాగుంటుందనిపిస్తుంది. నీకూ అలాగేవుంటుందికదూ!ఉంటుందని చెప్పవూ. నాకోసం సమయం కావాలంటూ గోల చేసే నేను ఇప్పుడు ఏమి చేస్తున్నాను. పిచ్చివానిలా నీ గురించి ఆలోచిస్తున్నాను. అసలు నీ జ్ఞాపకాల తోటలో విహరించడానికే నేను ఏకాంతం కోరుతాను కాబోలు. సెల్ ఫోను మూగగా కొట్టుకొంటోంది నా గుండెలాగానే. ఏదో వినిపించాలనే ఆరాటందానిది. ఆలోచనలు కొనసాగించాలనే పోరాటం నాది. మనిషితో మాట్లాడాలనుకున్నప్పుడు ఎన్ని అడ్డంకులో కదా? మనసు భాషకు అడ్డులేదు,హద్దులేదు. మళ్ళా ఎప్పుడో ఇలా తనివితీరా మాట్లాడడం? నేస్తం ఊసులన్నీ పోగేసి వుంచు. ఏదో ఒక రోజు నీ ఏకాంతంలో జతచేరుతాను.

No comments: