రెండు అరచేతుల కలయికేనా
కాదిది
రెండు హృదయాల చేరువ...
ఒకరికొకరి స్పందనను
ఎదలోతుల్లోకి కొనిపోయి
కళ్ళలో కాంతులు పూన్చి
చిరునవ్వుల వెన్నెలలు విరిసే
ఆ క్షణాలు
మరపురాని హృదయాలింగనాలు...
అలా రెండు చేతులు తాకగానే
జర జరా రక్త నాళాలగుండా
ఓ విద్యుత్తు ప్రసారమై
ఏనాటివో తీపి గురుతులను
మేల్కొలిపి కనుల ముందు
వెండి తెరపై చిత్రంలా పరచుకుంటాయి...
గట్టిగా వత్తిన స్పర్శతో
అంతరాళంలో అలముకున్న
అనుమానాపు పొరలు తొలగి
ఒక్కసారిగా అలాయి బలాయి
చెప్పుకుంటాయి....
అంధునికైనా కరచాలనం
నీ రూపును
నీ మనసును
చూపుతుంది కదా....
మిత్రమా!
తొడుగులన్నీ తొలగించి
ఎదనిండా స్నేహాన్ని ఊపిరి చేసుకొని
తొలకరి చినుకులా నవ్వుతూ
ఒక్కసారి చేయికలుపుమా...
No comments:
Post a Comment