Saturday, 29 December 2012

కొంపముంచిన ఆశ....!!

ఒక పడవ సముద్రపు హృదయాన్ని చీల్చుకుంటూ పరుగులు తీస్తోంది.... చీకటి తెరలని భానుడు చీల్చుతున్న వేళ.... ఒక మనిషి చల్లటి గాలిని పీల్చుకుంటూ ఊహల వెంట పరుగు తీస్తున్నాడు నిరాశల సౌధాలని ఆశ, కూల్చుతున్న వేళ .. వలలో చిక్కిన చేపల బరువుని బట్టే ఆ జాలరి ఆకలి కరువు తీరుతుంది మరి... అందుకే ఆ ప్రయాణం అలుపుకి ,ఆలి పిలుపుకీ ఆగని ప్రయాణం... వాతావరణ శాఖ వారి హెచ్చరికలని బేఖాతరు చేసిన అతను సముద్రపు తల్లిపై నమ్మకంతో ముందుకెళ్తున్నాడు ... తిరిగిస్తాను అనే 'నమ్మకం' ఎన్నటికీ నిలవదు అని నమ్మక.... విసురుగా విసిరాడు వలని సముద్రంలోకి ఒక చోట ఆగి.... సగం నిండింది వల కానీ, అతగాడి మనసు పూర్తిగా నిండలేదు మరి... మరో సారి విసిరాడు మరిన్ని చేపలు పొగయ్యాయి... మళ్లీ విసిరాడు... ఇంకొన్ని పోగయ్యాయి అవసరాన్ని మించి ఆశపడితే ఆపదే అని తెలియదతనికి .. ఇంతలో తుఫాను ముంచెత్తింది రాక్షస అలల దాడి మరోవైపు సాగుతుండగా... ఈ ఘోరకలికి అదృశ్య సాక్షి అయిన సూరీడు తుఫాను వెలిసే సరికి పశ్చిమపు ఇంటికి పలాయనం చిత్తగించాడు... భయం తోడుగా భర్తని వెతుక్కుంటూ వచ్చిన భార్యకి తను పట్టిన చేపలతోనే మొగుడు ఒడ్డుకి కొట్టుకురావడం కనిపించింది తక్షణం ఆమె కాళ్ళ కింద నేల కంపించింది... ఆ ఊరికి మళ్లీ తెల్లారింది కానీ ఆమెకి కాదు....!! -శతఘ్ని...!!

No comments: