Saturday, 29 December 2012

శిశు గీత

ఏ అనుబంధం నన్ను కడుపులో పెంచిందో, ఏ అసహనం నన్ను అక్కరలేదు అనుకుందో, ఏ సమస్య నన్ను వదిలించుకోమందో, ఏ నిర్ణయం నన్ను బుట్ట దాఖలు చేసిందో, ఏ ఆలోచన నన్ను అంతం చేసిందో, ఏ విషాదం నన్ను దూరం చేయమందో, ఏ సందిగ్దం నన్ను తప్పించుకోమందో, ఏ సందర్భం నన్ను సాగనంపిందో, ఏ సలహా నన్ను చంపివేయమందో, ఏ సమాజం నన్ను పంపివేయమందో, అమ్మా నాన్నలకే అక్కరలేని నేను, అన్యులైన మిమ్ము అడుగుతున్నా. ఎక్కడిదీ బిడ్డలను చంపుకునే అసాంఘిక ధర్మం? ఎక్కడిదీ ఆడపిల్లలను కడతేర్చే ఆటవిక న్యాయం? ఎక్కడిదీ మానవతను మంటగలిపే బుద్దిమాంద్యం? ఎక్కడిదీ అంతరాత్మను చంపుకొనే అంధ అజ్ఞానం? ఎక్కడిదీ వారసత్వపు శకలాలను మూటగట్టే మూఢత్వం? ఎక్కడిదీ మాతృత్వాన్ని మంటగలిపే గొడ్డుమోతుతనం? ఎవరు తెచ్చారు ఈ సంకరజాతి సంస్కృతిని ? ఎవరు నేర్పారు ఈ వికృతనీతి విష క్రీడని? ఎవరు ఎదుర్కుంటారు ఈ విపరీత పరిణామాన్ని? ఎవరు వేటాడుతారు ఈ విషపు విహంగాన్ని? నిష్టూరమన్న (అమంగళం) నన్ను, సృష్టి కి ప్రతి సృష్టిగా గుర్తించే వరకూ నేనింక తిరిగి రాను. Meraj Fathima

No comments: