Wednesday, 21 March 2012

నా కళ్ళకి చీకటి రాబోతుంది నా గొంతు మూగబోవడానికి సిద్దమవుతుంది

నీ స్నేహం ఎడారిలో నవ వసంతం
నీ తలపు కడలిలో దారిచూపిన ధృవకిరణం 

నీ సహచర్యం నిశీధిలో నను తాకిన శశికిరణం

కదిలే కాలం తన కాళ్ళ కింద నా హృదయాన్ని అణచివేస్తున్నా...... 

మరణించే కాలం మిగిలున్నంతవరకు ఓ చెలియా....

నీ చెలిమి నిన్ను మరవనివ్వదు 

నీ జ్ఞాపకం నిన్ను మరుపు రానివ్వదు

నీతో గడిపిన క్షణాలన్నీ ఇకపై నన్ను ప్రశ్నిస్తాయి

ఎందుకు మళ్ళీ ఆ అవకాశాన్ని మాకివ్వడంలేదని?

నీతో మాట్లాడిన నా హృదయం 

నిన్ను కలిసే వరకు నాతో మాట్లాడనని మారాం చేస్తుంది...!

నీతో నడిచిన నా పాదాలు తమతో నడిచే నీ పాదాల కోసం ఎదురుచూస్తాయి....

వాటికి తెలియదు కదా.. ఇకపై మనం కలవమని కలిసుండే కాలం తిరిగిరాదని

నా కళ్ళకి చీకటి రాబోతుంది నా గొంతు మూగబోవడానికి సిద్దమవుతుంది

నా శరీరం నుండి నా హృదయం వేరు చేయబడుతోంది

నీ మనసుకి దూరమైపోవాలని వెళ్తున్న నాతో 

నా హృదయం అంటుంది నన్ను ద్రోహిని చేశావు కదరా.... అని 

దానికి ఏమని సమాధానం చెప్పను?

గుండెనిండా దు:ఖం ఆపుకుంటూ అణచుకోవడానికి ప్రయత్నిస్తూ పారిపోతున్న.... అలిసిపోతూ పరుగులు తీస్తున్న

నేనేమైపోయాననే ఆనవాళ్ళు కూడా నీకు తెలియనంత వరకు పరుగులు తీస్తూనే ఉంటా

బహుశా! ఈ పరుగు "జీవితం లో ఏదైతే నా దగ్గరికి రావొద్దనుకున్నానో దాని ఒడి చేరే వరకేమో 

అదేంటో అని ఆలోచిస్తున్నావా? అదిగో చూడు నా వైపు వెటకారంగా చూస్తూ హేళన చేసే నవ్వుతో

నాకు స్వాగతం పలుకుతుంది..................ఒంటరితనం

No comments: