తెలుగు చచ్చిపోతోందంటే దిగులేస్తోంది…
తేట నీటి అలల వలపు తెలుగు
వగరు ఒగర్పుల ఉగాది పచ్చడి తెలుగు..
జిలుగు వెలుగుల తరుగు లేని పసిడి తెలుగు..
అధః పాతాళానికి పడనీయని నుడికట్ల నిచ్చెన తెలుగు..
అయినా.. వయసైపోయింది..
జరా మరణాలు సహజం…మందులు మింగినా తగ్గని జలుబంత సత్యం..
అయినా…ఇంకెన్నాళ్ళు బ్రతుకుతుందిలే..
వాయిదాలేస్తోంది ఇప్పటికే..
ప్రాచీన అర్వాచీనాలని…పట్టుకు వేళ్ళాడుతూ…
కానీ…ఎక్కడో ఏదో .. తడి లాంటి తెలియని వెలితి…
నరం మెలి తిప్పే బాధ.. మోచేతి దెబ్బలా..
శబ్దం లేని రంపపు కోతలా…
అమృతమే తాగకపోతే…
“ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహముల”ని…ఎవరడుగుతారు??
“మసి అంటని మానవతా మణి మందిరాల“ని.. ఎవరు మేల్కొలుపుతారు??
“వెన్నెలంతా మేసి యేరు నేమరేసిందం“టూ…మనల్నేవరు నమ్మిస్తారు??
“మంచి అన్నది మాల అయితే మాల నేనగుదున్“…అంటూ మనకెవరు గడ్డి పెడతారు??
“బాధా సర్పద్రష్టులార..! ఏడవకండేడవకండి…”..అనేవరు జ్వలిస్తూ లాలిస్తారు..??
“పున్నాగ పూల సన్నాయి పాట“ల నెవరు వినిపిస్తారు??
నా దుఖం లో నేనుంటే..
మరో ప్రపంచం పిలుస్తోందా మళ్ళీ?… హేళనించిందో స్వరం..
కాదు..కాదు.. మరి ప్రపంచం లేదన్నాను నేను..
ఇదేమీ నా గొప్ప కాదు..
ఈ తరానికి పై రాతల లోతులు.. అవి మార్చే గీతలు అక్కర్లేదు
అలా రాయగలిగే వాళ్ళు..వాళ్ళ పర లోకాల, ఇలాతలంలో తొంగి చూడట్లేదు..
సరే..పెరుగుదాం ఇలాగే..
అమ్మ చేయి విదిలించుకున్న చంటిపిల్లాడిలా..
అమృత భాష తోడు రాని మృత జీవాల్లా..
పోనీ.. మీకన్నా తెలుసా..?
వాట్ హాప్పెండ్ టు అవర్ తెలుగు అని..???
No comments:
Post a Comment